
మేల్ వెణ్ ప్పాకం శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ క్షేత్ర వైభవం.
భార్గవ మహర్షి సత్యయుగంలో తపమాచరించి శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం వరముగా పొందిన క్షేత్రం.
ఆ స్తోత్రం జపించడం ద్వారా శ్రీ లక్ష్మీ నారాయణులు భార్గవ మహర్షికి దర్శనమిచ్చారు.
శంఖ,చక్రాలను ధరించి అభయముద్రతో లక్ష్మీ సహితుడై
చిరు మందహాసముతో దర్శనమిచ్చి. భార్గవ మహర్షి కోరిన కోరిక ప్రకారం లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం ఆవిర్భావ క్షేత్రంలోనే వెలసి భక్తులను అనుగ్రహించునట్లుగా వరమిచ్చెను.
సత్యయుగంలో పదకొండు అడుగుల స్వరూపంతో అర్చామూర్తిగా(సాలగ్రామ మూర్తిగా) దర్శనమిచ్చిన స్వామి, ధర్మం క్షీణించిన కొద్దీ
త్రేతాయుగంలో తొమ్మిది అడుగులతో
ద్వాపరయుగంలో ఆరు అడుగులతో
ప్రస్తుతం ఈ కలియుగంలో రెండున్నర అడుగుల స్వరూపంతో మనం దర్శించవచ్చు.
నాలుగు యుగములుగా ఈ క్షేత్రం లో వెలసి యుగధర్మాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటూ భక్తసులభుడిగా ఉన్నందున స్వామిని
*యుగనారయణ స్వామి*
అనే పేరుతో పిలుస్తారు.
అమ్మవారు ప్రధానంగా ఉన్నటువంటి క్షేత్రాలలో అతి ముఖ్యమైన క్షేత్రం.
ఏ క్షేత్రంలో అయినా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి అంటే స్వామి అనుమతి ఉండాలి.
అనుమతి ఉన్నప్పటికీ ఒక్క వరం మాత్రమే అనుగ్రహిస్తారు.
కానీ మేల్ వెణ్ ప్పాకం క్షేత్రంలో అష్టలక్ష్ములూ ఏకమై ఒకే రూపంలో ఉంటూ స్వామి అనుమతి లేకుండా ఒకే సమయంలో మూడు వరములను అనుగ్రహిస్తారు.
అందువలన ఈ క్షేత్రం లో అమ్మవారిని
*స్వతంత్ర లక్ష్మీ* అనే నామంతో పిలుస్తారు.

శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీయుగనారాయణ పరబ్రహ్మణే నమః
శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీయుగనారాయణ స్వామివారు సత్యయుగంలో ఇక్కడ వెలసినప్పటినుండి
ఈ క్షణం వరకూ సప్తర్షులు
(అత్రి, భృగు,కుత్స,వశిష్ఠ,గౌతమ,కాశ్యప,అంగీరస)
నిత్యం ఆ దివ్య దంపతులనూ స్తుతిస్తూ ఉండటం వలన
మేల్ వెణ్ ప్పాకం తపోక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ఏ క్షేత్రంలోనూ లేనటువంటి ఆశ్చర్యకరమైన విషయం
స్వామి యొక్క దృష్టి అమ్మవారి చూపులు సమానంగా భక్తులపై ప్రసరించే అద్భుత దృశ్యం ఇక్కడ చూడవచ్చు
వారిరువురి కరుణా కటాక్ష వీక్షణలు మనపై ప్రసరిస్తే ఏం విశేషం?
క్షీరసాగర మథనం తరువాత పదవీకాంక్షతో ఇంద్రుడు ఈ విధంగా అమ్మవారిని స్తుతించాడు.
ధారాపుత్రస్తస్తదాగార సుహృద్ధాన్య ధనాధికం |
భవేత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణాత్ నృణాం ||
వివాహం, సత్సంతానం, గృహం,బంధు-మితృలు అత్యధికంగా ధన-ధాన్యములు అన్నీ నిత్యం అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు ఎవరిపై ప్రసరిస్తారో వారికి సకల సౌక్యములు లభిస్తాయి.

కావున క్షేత్రమునకు శీఘ్ర వివాహం కొరుకు, సత్సంతానం, అన్యోన్య దాంపత్యం కోసం,ఉన్నత పదవి/అధికార ప్రాప్తి, వ్యాపార లాభం,ఋణం బాధలు తొలగుటకు వేల కొలది భక్తులు విచ్చేస్తుంటారు.
త్రేతాయుగంలో శ్రీరాములవారి ఆదేశానుసారం శ్రీ ఆంజనేయ స్వామి మూడు మండలాల (48×3=144) కాలం తపమాచరించిన క్షేత్రం. ఇప్పుడు కలియుగంలో యోగాంజనేయ స్వామిగా మనం దర్శించవచ్చు.